సంగారెడ్డి ఆర్డీవో బదిలీ సంచలనం
భూ కుంభకోణాల ఆరోపణలపై ఆర్డీవో రవీందర్ రెడ్డి తక్షణ బదిలీ..!!
నిషేధిత భూములకు హక్కులు కల్పించడం, అసైన్డ్ ల్యాండ్స్ లో అక్రమాల ఆరోపణలు..!!
రూ.2వేల కోట్ల విలువైన భూముల మాఫియా బయటపడినట్లు ఆరోపణలు..!!
పటాన్చెరు, రామచంద్రాపురం, కంది, అమీన్పూర్, జిన్నారం మండలాల్లో భూముల సర్దుబాట్లు..!!
సీసీఎల్ఎ విచారణలో షాకింగ్ నిజాలు…రాత్రికి రాత్రే ఫైళ్లు తరలింపు..!!
సంగారెడ్డి జిల్లా అధికార వ్యవస్థను కుదిపేసే పరిణామం వెలుగులోకి వచ్చింది. జిల్లా ఆర్డీవో రవీందర్ రెడ్డిని భూ అక్రమాల ఆరోపణలతో ప్రభుత్వం తక్షణమే బదిలీ చేసింది. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసి, ఆయనకు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా నేరుగా ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించడం సంచలనంగా మారింది.

అధికార వర్గాల సమాచారం ప్రకారం, పటాన్చెరు పరిధిలోని నిషేధిత 10 ఎకరాల భూమిని కార్పొరేటర్‌కి హక్కులుగా మలచడం, జిన్నారం మండలంలో 80 ఎకరాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు అనుకూలంగా దారాదత్తం చేయడం, అలాగే ముత్తంగి–రుద్రారం–కంది ప్రాంతాల్లో విలువైన అసైన్డ్ భూములకు అక్రమ రీతిలో హక్కులు కల్పించటం వంటి చర్యలు ప్రధాన కారణాలుగా చెప్పబడుతున్నాయి.
అంతేకాక, వెలిమెల గ్రామంలో రెండు జిల్లాల సరిహద్దు భూములపై నేరుగా పైరవీ చేయడం, రూ.2వేల కోట్ల విలువైన 60 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక ప్రముఖ రియల్టర్‌కి సర్దుబాటు చేయడం వంటి అంశాలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఈ వ్యవహారంపై సీసీఎల్ఎ అధికారులు ఇప్పటికే దర్యాప్తు చేసి కొన్ని లావాదేవీలను నిలిపివేసినట్లు సమాచారం.
పటాన్చెరు, రామచంద్రాపురం, కంది, అమీన్పూర్, జిన్నారం మండలాలకు చెందిన పలు కీలక భూముల ఫైళ్లు రహస్యంగా మాదాపూర్‌లోని రియల్ ఎస్టేట్ కార్యాలయాలకు తరలించబడి, రాత్రికిరాత్రే సర్దుబాట్లు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆర్డీవో బదిలీతో సంగారెడ్డి జిల్లా రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఇంకా ఎంత మేరా భూ కుంభకోణాలు వెలుగులోకి వస్తాయో సమగ్ర దర్యాప్తు తేల్చాల్సి ఉందని స్థానికులు అంటున్నారు.